చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చెన్నై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  గురువారం నాడు ఉదయం నుండి వర్షం కురుస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

తమిళనాడు, కేరళతో సహా తీవ్ర దక్షిణ ద్వీప కల్పంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ  బుధవారం నాడు ప్రకటించింది.

ఇవాళ చెన్నై నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు.గత వారం క్రితమే నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడ పలు ప్రాంతాలు జలమైన విషయం తెలిసిందే.

అండమాన్ కు సమీపంలో బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడడం, ఈశాన్య రుతుపవనాలు రావడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నగరంలో ఇప్పటికే 150 నుండి 200 మి.మీ వర్షపాతం నమోదైనట్టుగా సమాచారం.

రానున్న గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.