దేశ రాజధాని ఢిల్లీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెల మొత్తంలో ఢిల్లీలో కాసిన ఎండ గత 72 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసింది. అయితే మే నెల 2వ తేదీ నుంచి కొంత వాతావరణం చల్లబడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. 

ఎండ‌ల దంచికొడుతున్నాయి. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 వర‌కు విప‌రీతంగా ఎండకాస్తోంది. దీంతో అంద‌రూ ఉక్క‌పోత‌త‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే దేశంలో ప‌లు ప్రాంతాల్లో ఎండలు ఎలా ఉన్నా సాధార‌ణంగా ఢిల్లీలో మాత్రం కొంత చ‌ల్ల‌గానే ఉండేది. కానీ ఈ సారి దేశ రాజ‌ధానిలో కూడా విప‌రీతంగా సూర్యుడు త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. 

ఢిల్లీలో ప్ర‌జ‌లను తీవ్రమైన వేడిగాలులు పీడిస్తున్నాయి. నగ‌ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. శ‌నివారం కూడా మరోసారి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగానే న‌మోదైంది. దీంతో ఢిల్లీలో ఏప్రిల్ మాసంలో న‌మోదైన మొత్తం ఉష్ణోగ్ర‌త గ‌త 72 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేసింది. కాగా ఈ నెల‌లో భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మహపాత్ర ప్రకారం..పశ్చిమ-మధ్య వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 

అలాగే భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మ‌హాపాత్ర తెలిపారు. వాయువ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అలాగే తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంద‌ని చెప్పారు. అయితే ఢిల్లీలో సోమ,బుధవారాల్లో దుమ్ము, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. ఇది ఎండ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ వాసుల‌కు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించే అంశం. ‘‘సోమవారం, బుధవారం ఢిల్లీ సిటీలో దుమ్ము లేదా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది కాబట్టి ప్రజలు వేడి నుండి కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. మంగళవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది’’ అని IMD అధికారులు తెలిపారు.

ఏప్రిల్ నెల మొత్తం ఎండ‌ల‌తో ఇబ్బంది ప‌డిన‌ప్ప‌టికీ మే 2 తర్వాత వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. దీంతో భానుడి ప్ర‌భావం వ‌ల్ల క‌లిగే ఉష్ణోగ్ర‌త త‌గ్గి, ఉక్క‌పోత నుంచి త‌ప్పించేకునే అవ‌కాశం ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయ‌ని వాతావర‌ణ విభాగం వెల్ల‌డించింది. రాజస్థాన్ లోని అజ్మీర్ గేట్ ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక, జమ్మూలో రికార్డుస్థాయిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావ‌డం ఎండ‌ల తీవ్ర‌త‌కు అద్దంప‌డుతోంది. ఒడిశాలో మూడు రోజుల నుంచి వరుసగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్నాయి. అధిక ఎండల కారణంగా పాఠశాలలకు ఒడిశా ప్రభుత్వం సెలవులు ప్ర‌క‌టించింది. వెస్ట్ బెంగాల్ లోనూ వేడి గాలుల తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో అంతకు ముందే అక్క‌డ పాఠ‌శాల‌ల‌కు అధికారులు సెల‌వులు ఇచ్చేశారు.