పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట.. తమ నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించేశారు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని గౌరీపాళ్యకు చెందిన రక్షిత (24), శేషాద్రి (27) మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కాగా.. వీరి కులాలు వేరు కావడంతో.. వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు.  ఇరు కుటుంబాలకు దూరంగా వచ్చి వేరే చోట పనిచేసుకుంటూ జీవిస్తున్నారు.

బెంగళూరు విధానసౌధలో కేస్‌ వర్కర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ సహాయంతో తమను హత్య చేయించేందుకు తమ కుటుంబాల సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఈ నెల 7న జగ్జీవన్‌రామ్‌ నగర ఠాణాలో వీరు ఫిర్యాదు చేశారు. 

అనంతరం వారిద్దరూ నగరం విడిచి చిక్కమగళూరు జిల్లా మూడిగెరెకు వెళ్లారు.ఈ నేపథ్యంలో సోమవారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో వారిద్దరూ తమ వివాహం, ఇరు కుటుంబాలు, గంగాధర్‌ బెదిరింపులను తెలిపారు. ఇదే తమ చివరి వీడియో అంటూ ఒక ఖాళీ ప్రదేశంలోని చెట్టుకు ఉరేసుకుని మృతిచెందారు. ఆ ఫేస్ బుక్ లైవ్ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.