Asianet News TeluguAsianet News Telugu

హత్రాస్ ఘటన: రంగంలోకి సీబీఐ.. ఘటనాస్థలికి బాధితురాలి తల్లి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ హత్యాచార ఘటనపై విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లడంతో దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగారు

Hathras Victim's Mother Taken To Crime Scene By CBI
Author
Hathras, First Published Oct 13, 2020, 5:09 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ హత్యాచార ఘటనపై విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లడంతో దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగారు. ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ, 379-డీ(సామూహిక లైంగిక దాడి), 307(హత్యాయత్నం), 303(హత్య)తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది.

ఘటనాస్థలి వద్ద ఆధారాలు సేకరించేందుకు నేడు ఫోరెన్సిక్‌ నిపుణులను తీసుకువెళ్లింది. గతంలో షిమ్లా అత్యాచారం, హత్య కేసును విచారించిన సీమా పహుజా నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. 

ఈ క్రమంలో సీబీఐ అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం బాధితురాలి సొంత గ్రామానికి చేరుకుంది. డిప్యూటీ సూపరిండెంటెండ్‌ ఆఫ్‌ పోలీస్‌ సీమా పహుజా నేతృత్వంలో, ఫోరెన్సిక్‌ నిపుణులు, పోలీసు అధికారులు, బాధితురాలి సోదరుడితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

అంతేగాక బాధితురాలి తల్లిని కూడా క్రైంసీన్‌ దగ్గరకు తీసుకువెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను అంబులెన్సులో ఇంటికి తరలించారు. 

కాగా అగ్ర వర్ణానికి చెందిన నలుగురు యువకులు తల్లితో కలిసి గడ్డి కోస్తున్న సమయంలో మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లి బాధితురాలిని చిత్ర హింసలకు గురిచేశారు. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడటంతో పాటు నాలుక కోసి, వెన్నుముక విరిచి అత్యంత పాశవికంగా దాడి చేయడంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సెప్టెంబరు 30న యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios