ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇటీవల ఓ పంతొమ్మిదేళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే అదే ప్రాంతంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఆ కామాంధుడు చిన్నారికి సమీప బంధువు కావడం గమనార్హం. 

పూర్తి వివరాల్లోకి వెళితే... హథ్రస్ లోని సాన్సి ప్రాంతానికి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటోంది.  కాగా.. ఆ సమయంలో అక్కడికి వారి సమీప బంధువు వచ్చాడు. ఎవరూ చూడకుండా చిన్నారిని తన వెంట ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో చిన్నారి తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు.

సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి పరిస్థితిని చూసి అనుమానం కలిగింది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. హథ్రస్ ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన తల్లితో కలిసి పొలానికి వెళ్లిన యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 29న మృతి చెందింది. కాగా.. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులను శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.