డీఎంకె, అన్నాడీఎంలకు సవాల్: ప్రధాన ప్రతిపక్షం నుండి పట్టుకోల్పోయిన డీఎండీకే
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కాంత్ కీలకంగా వ్యవహరించారు. ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదిగిన పార్టీ తిరిగి పట్టుకోల్పోయింది. అయితే ఇందుకు అనేక కారణాలున్నాయి.
న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ కాంత్ ఏర్పాటు చేసిన డీఎండీకె కీలక స్థాయికి ఎదిగింది. తమిళ అసెంబ్లీలో ఒకానొక దశలో ప్రతిపక్ష స్థానానికి ఎదిగింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీ క్రమంగా పట్టుకోల్పోయింది.
2005లో సినీ నటుడు విజయ్ కాంత్ డీఎండీకెను ఏర్పాటు చేశారు. 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయ్ కాంత్ అడుగు పెట్టారు.వృద్ధాచలం అసెంబ్లీ స్థానం నుండి విజయ్ కాంత్ అసెంబ్లీలో అడుగు పెట్టారు.
2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకెతో విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే పొత్తు పెట్టుకుంది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించింది. 2011 ఎన్నికల్లో డీఎంకె కంటే ఎక్కువ స్థానాల్లో డీఎండీకే సాధించింది. తమిళనాడు అసెంబ్లీలోని 41 స్థానాలకు విజయ్ కాంత్ పార్టీ పోటీ చేసింది. ఇందులో 29 స్థానాల్లో డీఎండీకే విజయం సాధించింది.
2011 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకె అప్పటి అధినేత జయలలితతో విజయ్ కాంత్ కు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకె తో పొత్తును తెగదెంపులు చేసుకున్నాడు విజయ్ కాంత్.
2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఎండీఎంకె, పీఎంకె,ఐజెకె, బీజేపీలతో డీఎండికె పొత్తు పెట్టుకుంది. 2016లో తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డీఎండీకె అన్ని స్థానాల్లో పోటీ చేసింది.పోటీ చేసిన స్థానాల్లో డీఎండీకే అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. విజయ్ కాంత్ కూడ ఉలుందుర్పెట్టై నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడు.
also read:డీఎండీకే చీఫ్, సినీ నటుడు విజయ్ కాంత్ కన్నుమూత: శోక సంద్రంలో అభిమానులు
డీఎంకె, అన్నాడీఎంకె లను తట్టుకొని 29 స్థానాలను దక్కించుకున్న డీఎండీకె ఆ తర్వాత పతనాన్ని చూసింది. పార్టీని నడిపించడంలో విజయ్ కాంత్ సరిగా వ్యవహరించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో డీఎంకె, అన్నాడీఎంకెలకు ప్రత్యామ్నాయంగా డీఎండీకేను నిర్మించాలని విజయ్ కాంత్ భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. రాజకీయాల్లో సమయానుకూలంగా ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. అందుకు అనుగుణంగా ఆ పార్టీ నాయకత్వం వ్యవహరించలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
పార్టీ ఏర్పాటు చేసిన తొలి నాళ్లలో ఇతర పార్టీల నుండి మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు డీఎండీకేలో చేరారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు విజయ్ కాంత్ అభిమాన సంఘం కూడ కీలకంగా వ్యవహరించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
2006 అసెంబ్లీ ఎన్నికల్లో 232 అసెంబ్లీ స్థానాల్లో డీఎండీకె అభ్యర్థులు పోటీ చేశారు. అయితే 201 అసెంబ్లీ స్థానాల్లో డీఎండీకే అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.కానీ, వృద్దాచలం అసెంబ్లీ స్థానం నుండి విజయ్ కాంత్ ఒక్కరే గెలుపొందారు. ఆ ఎన్నికల్లో విజయ్ కాంత్ పార్టీ 8.4 శాతం ఓట్లను సాధించింది.
2009 లోక్ సభ ఎన్నికల్లోని 39 ఎంపీ స్థానాల్లో డీఎండీకే పోటీ చేసింది. అయితే అన్ని స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయింది. అయితే ఆ ఎన్నికల్లో డీఎండీకే 10.1 శాతానికి తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వసంతన్ మరణించాడు. దీంతో విజయ్ కాంత్ భార్య ప్రేమలత, ఆమె సోదరుడు ఎల్ కె సుధీష్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు.ఇది పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమైందనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.
2011 ఎన్నికల సమయంలో డీఎంకె వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో డీఎండీకేతో ఆనాడు అన్నాడీఎంకె చీఫ్ జయలలిత పొత్తు పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకె 23 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కానీ డీఎండీకే మాత్రం 29 స్థానాల్లో విజయకేతనం ఎగురేసింది.
అయితే అన్నాడీఎంకె, డీఎండీకే మధ్య పొత్తు ఎంతో కాలం మనుగడ సాగించలేదు. సీఎం జయలలితపై డీఎండీకే చీఫ్ విజయ్ కాంత్ విమర్శలు చేయడం,డీఎండీకేతో పొత్తు పెట్టుకొని తప్పు చేశానని జయలలిత ప్రకటించడం ఈ రెండు పార్టీల మధ్య అగాధాన్ని మరింత పెంచాయి. 2011లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడిఎంకె ఒంటరిగా బరిలోకి దిగింది.
2012, 2013 మధ్య డీఎండీకే ఎమ్మెల్యే ఒకరు పార్టీకి రాజీనామా చేశారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పటి సీఎం జయలలిత పనితీరును ప్రశంసించారు. డీఎండీకే పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రామచంద్రన్ అన్నాడిఎంకెలో చేరి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.
2014 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్‌డీఏ కూటమిలో డీఎండీకే చేరింది. అయితే రాష్ట్రంలోని 39 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ 14 సీట్లలో విజయ్ కాంత్ పార్టీ పోటీ చేసింది. ఇందులో ఒక్క స్థానంలో కూడ ఆ పార్టీ విజయం సాధించలేదు
2011 ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థి చెంప చెళ్లుమనిపించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మైక్రో ఫోన్ పనిచేయకపోవడంతో పార్టీ అభ్యర్థిపై విజయ్ కాంత్ కొట్టాడు
తమిళనాడు రాజకీయాల్లో డీఎండీకే కీలక పాత్ర పోషించింది. తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం నుండి ఆ పార్టీ క్రమంగా పట్టుకోల్పోయింది. అయితే ఎప్పటి పరిస్థితులకు అనుగుణంగా విజయ్ కాంత్ ఎత్తుగడలు వేయలేకపోయారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. దీనికి తోడు డీఎండీకే పట్ల ప్రజల ఆశలను ఆ పార్టీ చేరులేకపోయింది. వీటన్నింటి నేపథ్యంలో తిరిగి అన్నాడీఎంకె, డీఎంకే మధ్య పోరుకు చేరింది.