మొదటి భార్య చనిపోయింది. బతకాల్సిన జీవితం చాలా ఉందని.. తోడు కోసం మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. తనకు రెండో పెళ్లి కావడంతో.. తానే ఎదురుకట్నం ఇచ్చి మరీ  చేసుకున్నాడు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో సరిగ్గా పెళ్లి జరిగి 15 రోజులు గడవగానే.. నవ వధువు కట్నం డబ్బుతో సహా పరారైంది. మోసోయిన విషయం ఆలస్యంగా గుర్తించిన వరుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన సురేందర్(36) అనే వ్యక్తి ఇటీవల వివాహమైంది. భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె వయసు 28ఏళ్లు.  ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. తీరా ఆ కట్నం డబ్బు, పెళ్లి నగలు తీసుకొని ఉడాయించింది. భార్య కనపడం లేదని పోలీసులను ఆశ్రయించిన వరుడికి ఊహించని షాక్ తగిలింది.

పోలీసుల దర్యాప్తులో ఆమె ఒక దొంగ అని తేలింది. పెళ్లి కావాల్సిన యువకులను టార్గెట్ చేసుకొని మరీ... ఇలా డబ్బులు కొట్టేయడం ఆ యువతికి వెన్నతో పెట్టిన విద్య. ఈ దందా చేయడంలో పెద్ద గ్రూపే ఉంది. ఆ గ్రూప్ అంతా కలిసి ప్రీ ప్లాన్డ్ గా యువకులను మోసం చేస్తారని తేలింది. ఇప్పటి వరకు 20 మందిని ఇలా మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. కాగా.. భార్య ఇచ్చిన షాక్ కి ఆ పెళ్లి కొడుకు మాత్రం ఇప్పట్లో తేరుకునేలా కనపడటం లేదు.