చండీగఢ్: హరియాణాలో బీజేపీకి షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు రాకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సుభాష్ బరాలా. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు బరాలా ప్రకటించారు. 

ఇకపోతే హరియాణా ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మెజారిటీ రాకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు కూడా నోటీసులు జారీ చేశారు. 

ఇకపోతే బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా పోటీ చేసిన తొహానా నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అమిత్ షా నోటీసులు ఇవ్వడంతో ఎన్నికల్లో ఎదురైన ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. 

ఇకపోతే హరియాణా ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టలేదు ఓటర్లు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో హంగ్ దిశగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే జననాయక్ పార్టీ అధినేత దుష్యంత్ చౌటాలా కింగ్ మేకర్ గా మారారు. 

ఇకపోతే హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేసేందుకు అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇకపోతే మాజీ సీఎం భూపేంద్రసింగ్ హుడాకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్ చేశారు. 

ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించాలని ఆదేశించారు. అందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదని కూడా ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటుకు పూర్తి స్వేఛ్చనిచ్చారు. దాంతో మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా జేజీపీ నాయకుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు బీజేపీ సైతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కింగ్ మేకర్ దుష్యంత్ చౌటాలాను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దుష్యంత్ చౌటాలా ఎవరివైపు కరుణ చూపితే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా ఎవరంటే