కరోనా వైరస్ నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు టీకా తయారు చేసే పనిలో బిజీగా వున్నాయి. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో వున్నాయి.

ఇక మనదేశం విషయానికి వస్తే ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు నవంబరు 20 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రయోగాల్లో హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌.. తొలి వాలంటీర్‌గా నమోదు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.   

ఇప్పటికే మొదటి రెండు దశల ట్రయల్స్‌ను భారత్‌ బయోటెక్‌ విజయవంతంగా పూర్తిచేసిన విషయం తెలిసిందే. దీంతో మూడో దశకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి భారత్‌ బయోటెక్‌ సన్నాహాలు చేపట్టింది. ఈ నెల 20 నుంచి ఈ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి.

ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాలు చేపట్టనుంది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం భారత్‌లో చేపడుతున్న అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్‌ ఇదే. ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు 28 రోజుల తేడాతో రెండు ఇంట్రామస్కులర్‌ ఇంజెక్షన్లు ఇస్తారు.

తొలి రెండు దశల్లో ఇప్పటి వరకు టీకా తీసుకున్న వాలంటీర్లలో ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.