Haridwar: హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇక రూర్కీలోని ఓ స్థానిక మసీదు వద్దకు రాగానే పెద్ద ఎత్తున ఇరు వర్గాల నినాదాలతో హింసాత్మక ఘర్షణకు దారి తీసింది.
Hindu Raksha Vahini: శ్రీరామ నవమి శోభయాత్ర, హనుమాన్ జయంతి ఊరేగింపు ఉత్సవాల నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానికంగా ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మత ఘర్షణల్లో పలువురు చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రూర్కీలో మత ఘర్షణల తర్వాత ముస్లింల ఇళ్లను కూల్చివేయాలని హిందూ రక్షా వాహిని అనే రైట్ వింగ్ గ్రూప్ డిమాండ్ చేసింది. తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే రెండు రోజుల్లో నగరంలో ధర్మసంసద్ నిర్వహిస్తామని ఆ సంస్థ హెచ్చరించింది. ఏప్రిల్ 16న స్థానిక మసీదు ముందు హనుమాన్ జయంతి ఊరేగింపు వెళుతున్నప్పుడు “జై శ్రీ రామ్”, “హిందుస్తాన్ మే రెహనా హై, తో జై శ్రీ రామ్ కెహనా హై” అనే నినాదాలు హోరెత్తడంతో ఇదంతా మొదలైంది. ఇరు వర్గాల మధ్య హింస చెలరేగింది. ప్రజాసంఘాలు, పోలీసులతో సహా కొంతమంది గాయపడ్డారు.
ఈ క్రమంలోనే మరింత మంది పోలీసులు రంగప్రవేశం చేసి.. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు మరో 12 మంది పోలీసులు అరెస్టు చేశారు. 40 మంది తెలియని వ్యక్తుల పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలావుండగా, ఊరేగింపు నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణల క్రమంలో తమ దుకాణాలను దోచుకున్నారనీ, ఇండ్లు, వాహనాలు ధ్వంసం చేశారంటూ.. జరిగిన ఘటన గురించి ముస్లింలు పోలీసులకు లేఖలు రాశారు. తమను కూడా కొట్టారని పలువురు ఆరోపించారు. మరోవైపు ముస్లింల ఇళ్లను కూల్చివేయాలని హిందూ రక్షా వాహిని డిమాండ్ చేసింది.
ఇండ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టుకు..
ముస్లింలకు చెందిన ఆస్తులను, ఇండ్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ జమియత్ ఉలమా-ఇ-హింద్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇళ్లు మరియు ఇతర భవనాలను ధ్వంసం చేయడానికి బుల్‌డోజర్‌లను ఉపయోగించడంపై జమియత్ ఉలమా-ఇ-హింద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది నేరాల ముసుగులో మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకునే కుట్రగా పిటిషన్ లో పేర్కొంది. జమియత్ ఉలామా-ఇ-హింద్ మౌలానా అధ్యక్షుడు అర్షద్ మదానీ మాట్లాడుతూ.. "కోర్టు అనుమతి లేకుండా ఎవరి ఇంటిని లేదా దుకాణాన్ని కూల్చివేయవద్దని రాష్ట్రాలను ఆదేశించాలని పిటిషన్ కోర్టును కోరింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో బుల్‌డోజర్ల రాజకీయం సాగుతుండగా, ఇప్పుడు గుజరాత్, మధ్యప్రదేశ్‌లోనూ ఈ నీచమైన చర్య మొదలవడం గమనార్హం. రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు, అణగారిన వర్గాల గొంతుకపై మౌనం వహిస్తున్నప్పుడు, న్యాయస్థానాలే న్యాయం కోసం ఆశాకిరణమని" అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఈ రకమైన ఉద్రిక్తలు పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
