న్యూఢిల్లీ: దేశంలోనే త్వరలోనే పబ్లిక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది.  ఇవాళ ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకొంది.

కేంద్ర కేబినెట్ నిర్ణయాలను బుధవారం నాడు  కేంద్ర ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరించారు.పీఎండబ్ల్యూఏఎస్ఐని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకొందన్నారు.  దేశంలో పబ్లిక్ వైఫై నెట్‌వర్క్ ల వృద్దిని ఇది ప్రోత్సహిస్తోందన్నారు.

కొచ్చి-లక్షద్వీప్ మధ్య సబ్ మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుట్ కనెక్టివిటీ ఏర్పాటు ప్రొవిజన్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు.ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికం అభివృద్ది ప్రణాళిక ప్రకారం యుఎస్ఓఎఫ్ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.

పబ్లిక్ వైఫై విస్తరణ ఉపాధిని సృష్టించడమే కాకుండా చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల ఆదాయాన్ని పెంచుతోందని కేంద్రం చెబుతోంది. దేశ జీడీపీని పెంచేందుకు ఇది దోహాదపడుతోందని కేంద్రం తెలిపింది.పబ్లిక్ వైఫై యాక్సెస్ ఇంటర్పేస్ పీఎం వాణిగా పిలుస్తారు. 

ఆత్మనిర్భర్ భారత్ యోజన పథకం కింద ఆర్ధిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.ఈ ఆర్ధిక సంవత్సరంతో పాటు 2023 వరకు 51,584 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 58.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కుతోందని మంత్రి తెలిపారు.