హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల  గవర్నర్ నరసింహాన్  సోమవారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో  భేటీ అయ్యారు.

రెండో దఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు మార్చే  యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి మాజీ కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్‌ లేదా పాండిచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీలలో ఎవరినో ఒకరిని గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో  నరసింహాన్ కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

కేంద్ర హోం శాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను కలువ లేదని... మర్యాద పూర్వకంగానే కలిసేందుకే తాను ఢిల్లీ వచ్చినట్టుగా   నరసింహాన్ చెప్పారు. అమిత్‌షాతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షా కు వివరించినట్టుగా ఆయన తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించామన్నారు.  ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

విభజన చట్టం ప్రకారం ఇప్పటికే తొలివిడతగా హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవనాలను... తెలంగాణకు ఇవ్వడానికి  ఏపీ సర్కార్ సుముఖత వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు.