అనారోగ్యంతో మరణించిన గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 5 గంటలకు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ.. రక్షణశాఖను కోరింది.

గోవాలోని మిరామిర్ బీచ్‌లో ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ స్మారకం పక్కనే పారికర్ అంత్యక్రియలు జరుగుతాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. మనోహర్ పారికర్ భౌతిక కాయాన్ని ప్రస్తుతం పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చారు.

పార్టీ నేతలు నివాళుల అనంతరం పారికర్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం కాలా అకాడమీకి తరలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని బీజేపీ తెలిపింది.

అంత్యక్రియలకు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. గత కొంత కాలంగా క్లోమగ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న మనోహర్ పారికర్ ఆదివారం సాయంత్రం 6.40 గంటలకు తుదిశ్వాస విడిచారు.