లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార ఘటనపై ఓవైపు రాష్ట్రం అట్టుడుకుతున్నా, యోగి ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ సీరియస్ గా వున్నా, పోలీసులు నిందుతులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హెచ్చరించినా కామాంధుల కళ్లు మాత్రం తెరుచుకోవడం లేదు. ఈ ఘటన జరిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి దారుణ ఘటనే మరోటి చోటుచేసుకుంది. గత నెల సెప్టెంబర్ 6వ తేదీ నుండి కనిపించకుండా  పోయిన ఓ యువతి పంటపొలాల్లో శవమై తేలింది. ఇద్దరు యువకులు ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసి వుంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. 

ఈ  దుర్ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. గత నెల 26వ తేదీన తమ కూతురు కనిపించక పోవడంతో ఓ వైపు వెతుకుతూనే పోలీసులకు కూడా పిర్యాదు చేసినట్లు మృతురాలి తండ్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె మృతదేహాన్ని శనివారం సాయంత్రం పొలాల్లో గుర్తించిన కొందరు తమకు సమాచారమిచ్చారని అతడు తీవ్ర ఆవేధన వ్యక్తం చేశాడు. 

మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసివుంటారని అనుమానిస్తున్నారు. బాధిత బాలిక తండ్రికి ఇద్దరు వ్యక్తులతో భూ వివాదం వుంది. దీంతో అతన్ని ఏమీ చేయలేక కూతురిపై దారుణానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు అనుమానితులిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

read more   హత్రాస్ ఘటన: బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్, ప్రియాంక

అనుమానాస్పద రీతిలో మృతిచెందిన బాలిక మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ పోస్టుమార్టం రిపోర్టు, అనుమానిత నిందితులు బయటపెట్టే వివరాలు, బాధిత కుటుంబం అనుమానాలు వీటన్నింటిని ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

మరోవైపు ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన హత్రాస్ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని అధికారులు కలిసిన తర్వాత సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
 పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై పెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఇటీవలే మరణించింది. ఆమె మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 

ఇక హత్రాస్‌ దారుణానికి వ్యతిరేకంగా ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లో నిరసనలు చెలరేగాయి. వీటిలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, భీమ్‌ ఆర్మీ చీష్‌ చంద్ర శేఖర్‌ ఆజాద్‌ పాల్గొన్నారు. దోషులను ఉరితీయాలని. ఉత్తరప్రదేశ్ సీఎం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.