గులాం నబీ ఆజాద్ ఆయన కొత్త పార్టీ పేరును డెమొక్రటిక్ ఆజాద్ పార్టీగా ప్రకటించారు. పార్టీ పతాకాన్నీ ఆవిష్కరించారు. తన పార్టీ సెక్యూలర్, డెమొక్రటిక్, ఇండిపెండెంట్‌గా ఉంటుందని వివరించారు. 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో తన పార్టీ పేరును ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసిన సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత ఆయన తన సొంత పార్టీ పేరు ప్రకటించడం గమనార్హం. అంతేకాదు, తన పార్టీ పతాకాన్ని కూడా ఆవిష్కరించారు. ఆ జెండాలో మూడు రంగులు ఉన్నాయి. ఒకటి మస్టర్డ్ కలర్, వైట్, బ్లూ కలర్‌లు ఉన్నాయి. అంతేకాదు, తమ పార్టీ గురించి కీలక విషయాలు వెల్లడించారు.

తమ పార్టీ లౌకిక, ప్రజాస్వామిక వైఖరులను కలిగి ఉంటుందని గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. అంతేకాదు, బయటి శక్తుల నుంచి ఎలాంటి ప్రభావాలకూ లోనుకాకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

గులాం నబీ ఆజాద్ నిన్న తనతోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వర్కర్లు, నేతలతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ నుంచి ఆయన నిష్క్రమించిన తర్వాత ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపైనా సూటిగా మాటలతో దాడి చేశారు. తాను వేరే ఏ పార్టీలోనూ చేరనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సొంతంగా ఒక పార్టీని స్థాపిస్థానని వెల్లడించారు. అంతేకాదు, తాను స్థాపించిన రాజకీయ పార్టీ జమ్ము కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పించడానికి పాటుపడుతుందని వివరించారు.

తన పార్టీకి తాను పేరు పెట్టనని, జమ్ము కశ్మీర్ ప్రజలు పార్టీ పేరును నిర్ణయిస్తారని తెలిపారు. తమ పార్టీ రాష్ట్ర హోదా కోసం మాత్రమే కాదు.. భూ హక్కులు, స్థానిక ప్రజలకు ఉపాధి అంశాలపై పోరాడుతుందని చెప్పారు.