2019 సాధారణ ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు.

మరోవైపు కశ్మీర్ అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. మరోవైపు యూనివర్సిటీల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంది.

ఆ ఆర్డినెన్స్ శనివారం ఉదయం జారీ అయిన పక్షంలో ఈ రోజు సాయంత్రమే కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నోటీఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్డినెస్స్ జారీ కాని పక్షంలో సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించింది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున పోలింగ్ జరిపేందుకు ఈసీ నిర్ణయించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏప్రిల్ 30న తెలంగాణలో.. మే 7న ఏపీలో పోలింగ్ నిర్వహించారు.