న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ ఆయన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని ప్రస్తావించారు. 

"నేను తినను.. తిననివ్వను... అని చెప్పిన మోడీ గాలిజనార్దన్‌రెడ్డిని, ఏపీలో ఏ-1, ఏ-2 లను ఎలా రక్షిస్తున్నారని అడిగారు. ఏపీకి ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. 

ఏపీలో మిగతా పార్టీలతో బీజేపీ కుమ్మక్కై టీడీపీని అడ్డుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. వైసీపీ ఎంపీలు మోడీ గెస్ట్‌ లిస్టులో ఉంటే టీడీపీ ఎంపీలు నిఘా జాబితాలో ఉన్నారని గల్లా జయదేవ్ అన్నారు. ఆ విషయం దేశం మొత్తానికి తెలుసునని అన్నారు. 

యూసీలు ఇవ్వలేదని.. లెక్కలు చెప్పడం లేదని కేంద్రం ఆరోపిస్తోందని, యూసీలు సమర్పించడంలో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలో అన్ని అంశాలను నేరవేర్చాలని డిమాడ్ చేస్తున్నామన్నారు.