Asianet News TeluguAsianet News Telugu

Gaganyaan​లో మరో ముందడుగు.. ఆ పరీక్ష సక్సెస్ అయిందని తెలిపిన ఇస్రో..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్​యాన్ (Gaganyaan)​ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. 

Gaganyaan Qualification testing of cryogenic engine for Gaganyaan programme successful
Author
Chennai, First Published Jan 13, 2022, 2:20 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్​యాన్ (Gaganyaan)​ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. గగన్‌‌యాన్ ప్రాజెక్ట్‌ కోసం క్రయోజెనిక్ ఇంజన్ (cryogenic engine) అర్హత పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 720 సెకన్ల పాటు ఇంజిన్‌ను మండించి.. పనితీరును పరిశీలించింది. ఈ మేరకు ఇస్రో బుధవారం ఒక ప్రకటన చేసింది. 

ఇంజిన్ పనితీరు పరీక్ష లక్ష్యాలను చేరుకుందని.. ఇంజిన్ పారామితులు మొత్తం వ్యవధిలో అంచనాలకు దగ్గరగా సరిపోలుతున్నాయని ఇస్రో తెలిపింది. ‘విజయవంతమైన ఈ దీర్ఘ కాల పరీక్ష గగన్‌యాన్ ప్రాజెక్టులో ప్రధాన మైలురాయి. ఇది గగన్‌యాన్ లాంచ్ వెహికల్‌లోకి ఉపయోగించే క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క విశ్వసనీయత. పటిష్టతను నిర్ధారిస్తుంది’ అని ఇస్రో పేర్కొంది.

ఈ క్రయోజెనిక్ ఇంజన్​ సుమారు 1810 సెకన్ల పాటు జరిగే మరో నాలుగు పరీక్షలను ఎదుర్కోనుందని ఇస్రో తెలిపింది. గగన్‌యాన్ కోసం క్రయోజెనిక్ ఇంజన్ అర్హతను పూర్తి చేయడానికి.. మరో ఇంజన్‌కు ఒక దీర్ఘకాలిక, రెండు స్వల్పకాలిక పరీక్షలను నిర్వహించనున్నట్టుగా పేర్కొంది.

ఇస్రో ఛైర్మన్​ శివన్​ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. గగన్​యాన్​ ప్రాజెక్టు డిజైన్​ ప్రక్రియ పూర్తయిందని, పరీక్షల దశలోకి ప్రవేశించామని తెలిపారు. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం 2022, ఆగస్టు 15లోపే మానవ రహిత గగన్​యాన్​ ప్రయోగం చేపడతామన్నారు. గడువులోపే పని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆ లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios