బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. బిహార్‌లో బీజేపీ ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్‌ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని ఈసీ స్పష్టం చేసింది. సమాచార హక్కు కార్యకర్త సాకేత్‌ గోఖలే కోరిన విజ్ఞప్తి మేరకు ఈసీ స్పందిస్తూ ఈ సమాధానం ఇచ్చింది.

ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన విషయంలో పార్ట్‌-VIIIలో పొందుపర్చిన ఏ నిబంధననూ ఉచిత టీకా హామీ ఉల్లంఘించడం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఆదేశిక సూత్రాల ఆధారంగా ప్రజల సంక్షేమం కోసం పార్టీలు ఎలాంటి సమంజసమైన హామీలనైనా మేనిఫెస్టోలో చేర్చవచ్చని గుర్తుచేసింది.   

మరోవైపు బీజేపీ ఇచ్చిన ఉచిత టీకా హామీ వివక్షాపూరితంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ గోఖలే ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

దేశం మొత్తం కరోనాతో బాధపడుతుంటే బీజేపీ కేవలం ఒక్క రాష్ట్రానికే ఈ హామీ ఇచ్చిందన్న విషయాన్ని ఈసీ విస్మరించిందని సాకేత్ ఆరోపించారు. కాగా బీహార్‌లో అధికారంలోకి వస్తే కరోనా టీకా ఉచితంగా అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ కేంద్ర మంత్రి, నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు.

దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఒక్క బీహార్‌కే టీకా ఇస్తే దేశంలోని రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.