ఛంఢీఘడ్: పంజాబ్ ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్ లైన్ లో క్లాసులు వినే విద్యార్థుల కోసం ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నెల 12వ తేదీన విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను అందించనున్నట్టుగా  ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పంజాబ్, ఛంఢీఘడ్ లలోని 26 ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లను విద్యార్ధులకు పంపిణీ చేయనున్నారు.

ప్రతి పట్టణంలో 15 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మందిని పిలవ కూడదని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో 12వ తరగతిని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధులకు స్మార్ట్ ఫోన్లను  అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎంచుకొంది. మరోవైపు ఈ నెల  12వ తేదీ అంతర్జాతీయ యువత దినోత్సవం కూడ. ఈ రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనుంది.

స్మార్ట్ ఫోన్లు విద్యార్థులు ఆన్ లైన్లో పాఠాలు వినేందుకు దోహాదపడుతోందని సీఎం అమరీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు.మొదటివిడతలో 50వేల స్మార్ట్ ఫోన్లను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందుకొంది. మిగిలినవి త్వరలో రాష్ట్రానికి చేరుకోనున్నాయి.

మొదటి దశలో 1.75 లక్షల స్మార్ట్ ఫోన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల ముందు విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.