కటక్: అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణ సంఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడి అంతమొందించి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో వదిలివెళ్లారు దుండగులు. తాజాగా స్థానికులు మృతదేహాన్ని గుర్తించడంతో ఈ విషయం బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... ఒడిషా జిల్లా ఢెంకనాల్ జిల్లా కడకారి ప్రాంతానికి చెందిన ఓ నాలుగేళ్ల బాలిక ఇంటిబయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. కొందరు దుండగులు బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని అటవీప్రాంతంలో తీసుకెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ముక్కుపచ్చలారని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత హతమార్చి అక్కడే పడేశారు. 

బాలిక ఆఛూకీ కోసం తల్లిదండ్రులు ఎంత వెతికనా లాభం లేకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలో ఓ చిన్నారి మృతదేహం వున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. 

బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అత్యాచారం చేసిన తర్వాతే బాలికను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్దారించామని... పోస్టుమార్టం రాపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.