జమ్మూకాశ్మీర్: భారతదేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూలోని నగ్రోట జిల్లాలోని బాన్ టోల్ లజ ప్రాంతంలో భారత సైన్యానికి ఉగ్రవాదులకు తారసపడ్డారు. దీంతో జమ్మూ కాశ్మీర్ హైవేపైనే కాల్పులు చోటుచేసుకోగా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 

ఉగ్రవాదులు జమ్మూ నుండి కాశ్మీర్ వైపు బస్సులో వెళుతున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసేశారు. ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న బస్సును చుట్టుముట్టారు. లొంగిపోవాలన్న భద్రతా బలగాల హెచ్చరికలను పట్టించుకోకుండా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భారత సైనికులు కూడా ఎదురు కాల్పులకు దిగాల్సి వచ్చింది. 

ఈ ఎన్కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద తుపాకులతో పాటు మరికొంత సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం సాయంత్రం జమ్మే కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 12మంది పౌరులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.  దీంతో అప్రమత్తమయిన బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టి తాజాగా నలుగురు ఉగ్రవాదుల మట్టుబెట్టారు.