షాజహాన్ పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. యూపిలోని షాజహాన్ పూర్ నగరంలోవి కాత్రా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. 

మృతులను అఖిలేష్ గుప్తా (42), బార్య రిషు గుప్తా (39), కుమారుడు శివాంగ్ (12), కూతురు హర్షిత (3)లుగా గుర్తించారు. అఖిలేష్ ఫోన్ నుంచి ఓ వ్యక్తి పోలీసులకు ఆ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

వ్యాపారంలో నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోటులో రాశారు. తొలుత పిల్లలకు ఉరేసి చంపి, ఆ తర్వాత తల్లిదండ్రులు ఉరేసుకుని మరణించారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అఖిలేష్ గుప్తా మందుల షాపు నడుపుతుండేవాడు. సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పాలు పోయడానికి మిల్క్ మ్యాన్ వచ్చాడు. రిషు పాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసేసింది. 

ఓ పని మీద ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి సాయంత్రం ఒంటి గంటన్నర ప్రాంతంలో అఖిలేష్ ఇంటికి వెళ్లాడు. తలుపులు కొద్ది తెరిచి ఉండడాన్ని అతను గమనించాడు. అఖిలేష్ ను పేరు పెట్టి పిలిచాడు. అవతలి నుంచి సమాధానం రాలేదు. దాంతో అతనికి అనుమానం వచ్చి ఆ ప్రాంతంలోని కొంత మందిని తీసుకుని వచ్చాడు. 

గ్రౌండ్ ఫ్లోర్ లో షాపు ఉంటుంది. వారు తలుపు తీసి రెండో అంతస్థుకు చేరుకున్నారు. వారికి నలుగురి మృతదేహాలు కనిపించాయి. దాంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.