పాట్నా: బీహార్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి గ్రామ పెద్దలు ఉమ్మి నాకించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే ఆరోపణపై పంచాయతీ పెద్దలు అతనికి శిక్ష వేశారు. శిక్షలో భాగంగా అతని చేత ఉమ్మి నాకించారు. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు 

ఈ సంఘటన పశ్చిమ బీహార్ జిల్లాలోని చైన్ పూర్ గ్రామంలో జరిగింది. శివశంకర్ గుప్తా అనే 22 ఏళ్ల యువకుడు సోమవారం రాత్రి ఇంటి పైకప్పునకు ఉరేసుకుని కనిపించాడు. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ ఫిర్యాదు మేరకు తన మొబైల్ ఫోన్ ను తిరిగి తెచ్చుకోవడానికి శివశంకర్ గుప్తా యువతి ఇంటి వద్దకు శని, ఆదివారాల మధ్య రాత్రి వెళ్లాడు. దాంతో సమస్య తలెత్తింది. యువతి ఫోన్ తో తన ఇంట్లోకి పరుగెత్తింది. దాన్ని తెచ్చుకోవడానికి అతను అక్కడికి వెళ్లాడు. యువతిపై అసభ్యంగా ప్రవర్తించడానికి వచ్చాడని భావించి గుప్తాను ఆమె కుటుంబసభ్యులు కొట్టారు. 

రెండు కుటుంబాలు కూడా విభిన్నమైన కులాలకు చెందినవి కావపడంతో ఘర్షణ తలెత్తింది. దాంతో సమస్య గ్రామ పంచాయతీ పెద్దల ముందుకు వచ్చింది. వారు విచారణ జరిపి గుప్తాను దోషిగా నిర్ణయించి, నేలపై ఉమ్మి వేసి దాన్ని నాకాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు. 

ఆ తర్వాత కుటుంబ సభ్యులతో ఇంటికి వచ్చాడు. ఆదివారం రాత్రి అతను తన గదిలోకి వెళ్లి గొల్లెం పెట్టుకున్నాడు. అతను నిద్రిస్తున్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే అందరి ముందు తనను అవమానించారనే మనస్తాపానికి గురై గుప్తా ఆత్మహత్య చేసుకున్నాడు.