తమిళనాడు దిగంగత మాజీ సీఎం జయలలిత నెచ్చలి శశికళ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న  సంగతి తెలిసిందే. అయితే.. పేరుకే అది జైలు శిక్ష అని.. కానీ అక్కడ ఆమె రాజభోగాలు అనుభవిస్తున్నారని తెలుస్తోంది.  సామాజికవేత్త ఎన్. మూర్తి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల్లో ఈ విషయాలు వెలుగు చూశాయి.

జైల్లో శశికళకు ప్రత్యేక వసతులు కేటాయించారని మూర్తి ఆరోపించారు.  ఆమెకు వీఐపీ సదుపాయాలు కల్పించి.. బయటకు మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

‘‘శశికళకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించారన్నది నిజం. ఆమెకు మొదట్లో ఒక్క గది మాత్రమే కేటాయించారు. అయితే ఆమె పక్కన ఉన్న నాలుగు గదుల్లో 2017 ఫిబ్రవరి 14 వరకు మహిళా ఖైదీలున్నారు. శశికళను జైలుకు తరలించిన తర్వాత వారిని వేరే చోటుకు పంపి.. ఐదు గదులను ఆమెకే కేటాయించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని శశికళ కోసం వంట చేయడానికి అధికారులు కేటాయించారు. నిబంధనల్నిఉల్లంఘించి.. శశికళను చూడటానికి గుంపులు గుంపులుగా ప్రజలను అనుమతిస్తున్నారు. నేరుగా ఆమె గదికి వెళ్తున్నారు. 3 నుంచి 4 గంటలపాటు ఉంటున్నారు’’ అని ఆయన మీడియాతో వివరించారు.

గత కొంతకాలంగా.. శశికళలో జైల్లో ప్రత్యేక వసతి కల్పిస్తున్నారంటూ ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంలో మూర్తి సమాచార హక్కు చట్టం ద్వారా మూర్తి నిజానిజాలు బయటపెట్టారు. ప్రస్తుతం మూర్తి ఆరోపణలు తమిళనాట సంచలనంగా మారాయి. ఈ ప్రత్యేక వసతుల కోసం శశికళ జైలు అధికారులకు రూ.2కోట్లు లంచంగా ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.