తిరువనంతపురం: కేరళలోని ఇడుక్కి జిల్లాలో చిరుతను వేటాడి వండుకొని తిన్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిరుతపులి గోర్లు, చర్మం విక్రయానికి పెట్టడంతో నిందితులు పోలీసులకు చిక్కారు. 

ఇడుక్కి శివారు గ్రామానికి చెందిన వినోద్ తన పొలంలోకి అటవీ జంతువులు ప్రవేశించకుండా ఉచ్చులు ఏర్పాటు చేశారు.  ఈ ఉచ్చులో పడిన అడవి జంతువలను వినోద్ చంపినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఇటీవల కాలంలో 50 కిలోల బరువున్న చిరుత కూడ వినోద్ పొలంలో ఉచ్చులో పడింది. దీంతో వినోద్ అతని స్నేహితులు కలిసి దాన్ని వండుకొని తిన్నారని పోలీసుల విచారణలో తేలింది. పులి చర్మం, గోళ్లు విక్రయానికి పెట్టి పోలీసులకు చిక్కారు. వీటిని విక్రయానికి పెట్టకపోతే పోలీసులకు నిందితులు చిక్కకపోయేవారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలిపారు.

విపి కురియకోస్, సాలి కుంజప్పన్, సీఎస్ బిను, విన్సెంట్, వినోద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా మానుకుళం గ్రామానికి చెందినవారుగా పోలీసులు ప్రకటించారు.నిందితుల నుండి పులి చర్మం, గోళ్లు,  పళ్లను స్వాధీనం చేసుకొన్నారు.