నొయిడాలో దారుణం జరిగింది. పెంపుడు కుక్కను విచక్షణా రహితంగా కొట్టాడో వ్యక్తి. ఈ దాడిలో శునకం కాలు విరిగింది. నోట్లోని పండ్లు ఊడిపోయాయి. ఈ ఐటీ ఉద్యోగిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

నొయిడాకు చెందిన ఐటీ ఉద్యోగి రిషబ్ మెహ్రా తన పెంపుడు కుక్క బడ్డీని దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో బడ్డీకి గాయాలయ్యాయి. కాలి ఎముక, కొన్ని దంతాలు విరిగిపోయాయి. కుక్క అరుపులు విన్న ఓ వ్యక్తి ఆ దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. 

ఆ వీడియోను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. శునకానికి న్యాయం జరగాలని, యజమానిని శిక్షించాలని కోరుతున్నారు. ఘటనపై భాజపా నేత, పీపుల్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకురాలు మనేకా గాంధీ కూడా స్పందించారు. మెహ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

అయితే ఇప్పటి వరకు యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతడిని శిక్షించాలని, జస్టిస్ ఫర్ బడ్డీ అనే హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అతడు ఉద్యోగానికి అర్హుడు కాదని, సంస్థ యాజమాన్యం అతడిని విధుల్లో నుంచి వెంటనే తొలగించాలని నెటిజన్లు కోరుతున్నారు. 

పోలీసులు అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మెహ్రాను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని మనేకా గాంధీ ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సినీనటి రిచా చద్దా సైతం స్పందించారు. అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని కోరారు. అలాంటి వ్యక్తి మీ సంస్థకు అవసరమా అని ప్రశ్నించారు.