LIC office: ముంబయిలోని ఎల్‌ఐసీ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న ఎనిమిది ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Fire Breaks Out In LIC Building In Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబయిలోని విలేపార్లే వెస్ట్‌లోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌ఐసీ కార్యాలయ భవనంలోని గ్రౌండ్, రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. రెండవ అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడుతోంది. దీంతో అక్కడి ప్రాంతంలో దట్టమైన పొగ చేరుకుంది. శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
ప్రస్తుతం ఎనిమిది అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కొన్ని ముఖ్యమైన పత్రాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం అందింది. ఇటు ఎల్ఐసీ అధికారులు సైతం కీలకమైన పత్రాలు కాలిపోయే అవకాశం ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఈ అగ్నిప్రమాదం గురించి వెల్లడిస్తూ.. ఎల్‌ఐసీ కార్యాలయ భవనంలోని గ్రౌండ్, మేడ అంతస్తులోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. రెండవ అంతస్తులోని కిటికీలు, ద్వారాలమార్గం నుండి పొగలు కమ్ముతున్నాయి. ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎనిమిది అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేందుకు ఇక్కడకు వచ్చాయనీ, ఇంకా మంటలు చెలరేగుతున్నాయని తెలిపారు.
కాగా, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారి తెలిపారు. దీనిపై విచారణ జరుగుతున్నదని పేర్కొన్నారు. అయితే, షాట్ సర్క్యూట్ కారణం కూడా అయివుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. "గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఎగువ రెండు అంతస్తుల ఎల్‌ఐసి ఆఫీస్ భవనంలోని రెండో అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం జరగింది. శాలరీ సేవింగ్ స్కీమ్ విభాగంలోని ఎలక్ట్రిక్ వైరింగ్, ఇన్‌స్టాలేషన్, కంప్యూటర్లు, ఫైల్ రికార్డులు, చెక్క ఫర్నీచర్ మొదలైన వాటికి అగ్నిప్రమాదానికి గురయ్యాయని ముంబయి అగ్నిమాపక అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా, శనివారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్‌లో కూడా ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని ఇండోర్‌లోని స్వర్న్ బాగ్ కాలనీలో రెండంతస్తుల భవనంలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. భవనం బేస్‌మెంట్‌లో తెల్లవారుజామున 3.10 గంటలకు అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రధాన విద్యుత్ సరఫరా వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలకు వ్యాపించాయి, వేగంగా భవనం మొత్తం దగ్ధమైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించారు. వారిలో ఐదుగురి గాయాలు కావడంతో.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
