నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతు సంఘాలతో మరోసారి కేంద్రం చర్చలు ప్రారంభమయ్యాయి.

ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై 40 మంది రైతు ప్రతినిధుల బృందంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు హోంమంత్రి అమిత్ షాతో కెప్టెన్ అమరీందర్ సింగ్ సమావేశమై చర్చించారు.

పంజాబ్, హర్యానా రైతులతో ఢిల్లీ సరిహద్దులు నిండిపోయాయి. అటు గుజరాత్, రాజస్ధాన్ నుంచి కూడా రైతులు వస్తున్నారు. మరోవైపు పద్మ విభూషణ్ అవార్డును పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ వెనక్కి ఇచ్చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని అమిత్ షాను కోరినట్లు పంజాబ్ సీఎం పేర్కొన్నారు.