వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి వాదనలు గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ఆందోళనతో పాటు వ్యవసాయ చట్టాల విషయంలో సుప్రీంకోర్టు వాదప్రతివాదనలు వింటోంది. 

మరోవైపు రైతుల ఆందోళనలపై రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ఎస్ మునిస్వామి రైతులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించిన రైతులు ఆందోళనలు చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. 

కర్నాటకలోని కోలార్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ మునిస్వామి మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవారు నకిలీ రైతులని, దళారులని, వారు పిజ్జా, బర్గర్‌లను తింటున్నారని, అక్కడ జిమ్ తయారు చేశారని ఆరోపించారు. ఈ డ్రామాను ఇంతటితో ముగించాలన్నారు. 

కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలోని వివిధ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఎంపీ మునిస్వామి ఆరోపణలకు ముందు బీజేపీ ఎంపి మదన్ దిలావర్ కూడా రైతులు చికెన్ బిరియానీ తింటూ దేశంలో బర్డ్‌ఫ్లూను వ్యాపింపజేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.