ఉత్తరప్రదేశ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యేను ఆయన నిర్వహించిన కార్యక్రమంలోనే ఓ రైతు కొట్టాడు. వేదికపై ఎమ్మెల్యే కూర్చుని ఉండగా.. ఓ వృద్ధ రైతు నేరుగా ఆయన వద్దకు వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా ఎమ్మెల్యే ముఖంపై చేతితో కొట్టాడు. వెంటనే అక్కడ ఉన్నవారు అప్రమత్తమై ఆయనను పక్కకు తీసుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

లక్నో: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలకు ఏ చిన్న లోపం కనిపించినా.. ఏ అంశం కలిసొచ్చినా.. ప్రత్యర్థి పార్టీలను చీల్చి చెండాడే పరిస్థితులు ఉన్నాయి. యోగి ప్రభుత్వంపై కత్తులు నూరడానికి ప్రతిపక్షాలకు తాజాగా, ఓ వైరల్ వీడియో అస్త్రంగా దొరికింది. ఓ సమావేశానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA)పై రైతు(Farmer) నేరుగా వచ్చి ఒక్కటిచ్చాడు(Slap). ఆ దెబ్బతో ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. చుట్టుపక్కల వారూ షాక్‌కు లోనయ్యారు. వెంటనే ఆ రైతును పక్కకు తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అయింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. ఇదే రోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం వెల్లడించే అవకాశం ఉన్నది.

ఉన్నావ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా ఓ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. అంతా సవ్యంగానే సాగుతున్నది. అదే సమయంలో అనుకోకుండా ఓ వృద్ధ రైతు స్టేజ్ మీదకు ఎక్కాడు. ఎకాఎకిన ఎమ్మెల్యే వద్దకు వచ్చి ముఖంపై ఒక్క దెబ్బ వేశాడు. వెంటనే ఇతరులు గుమిగూడు రైతును పక్కకు తీసుకెళ్లారు. ఎందుకు కొట్టావని కొందరు అడుగుతున్నట్టు అర్థమవుతున్నది. అయితే, ఆ రైతు ఎమ్మెల్యేను ఎందుకు కొట్టాడో ఇంకా కారణం తెలియరాలేదు. 

Scroll to load tweet…

ఈ ఘటనపై విమర్శలు వస్తుండటంతో ఎమ్మెల్యే పంకజ్ గుప్తా వివరణ ఇచ్చారు. దీనికోసం ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఆయన తన తండ్రి సమానులని వివరించారు. గతంలోనూ తాను ఇలాగే చేసేవారని తెలిపారు. ప్రతిపక్షాలే ఈ ఘటనపై పెడర్థాలు తీస్తున్నదని పేర్కొన్నారు. వారికి చర్చించడానికి ఏ అంశాలూ దొరకడం లేదని, అందుకే దీనిపై గగ్గోలు పెడుతున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి రైతులు వ్యతిరేకం అని వారు తప్పుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆయన తనను కొట్టలేదని, కేవలం ప్రేమగా ఓ చేయి తనపై వేశాడని వివరించారు.

‘నేను ఎమ్మెల్యే పంకజ్ గుప్తాను కొట్టలేదు. కేవలం ఆయనకు సన్నిహితంగా దగ్గరకు వెళ్లాను. ఆయనను కొడుకు అని సంభోదిస్తూ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాను’ అని ఆ వృద్ధ రైతు ఎమ్మెల్యే పక్కనే కూర్చొని విలేకరులకు వివరించారు. కానీ, ఈ ఘటన తప్పుడు సందేశాన్ని తీసుకువెళ్లుతున్నదని కదా అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రతిపక్షాలు ఎన్నికల కోసం ఈ ఘటనపై గగ్గోలు పెడుతున్నాయని అన్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. యోగి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ వైరల్ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఓ బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తా చెంపను ఓ రైతు చెల్లుమనిపించాడని పేర్కొన్నారు. ఆ దెబ్బ ఒక్క ఎమ్మెల్యేకు మాత్రమే కాదని, యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికే దెబ్బ అని వివరించారు. ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న హీన విధానాలు, హీన పాలన, నియంతృత్వ పోకడలపైనే ఆ దెబ్బ అని విమర్శించారు.