ఫేమస్ డేటింగ్ యాప్‌ టిండర్, హింజ్‌లలో ఉద్యోగాల తొలగింపులు ఉండనున్నాయి. వీటి మాతృసంస్థ అయిన మ్యాచ్ గ్రూప్ 8 శాతం ఉద్యోగులను తొలగించే నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు 200 మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. 

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగాల కోతతో భయపెట్టాయి. ఇంకా భయపెడుతున్నాయి. ఈ ఉద్యోగాల కోతలో డేటింగ్ యాప్ సంస్థలు కూడా చేరుతున్నాయి. ప్రముఖ డేటింగ్ యాప్‌లు టిండర్, హింజ్‌లు త్వరలోనే ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. సుమారు 200 మంది వర్క్ ఫోర్స్‌ను మ్యాచ్ గ్రూప్ తొలగించనుంది.

టిండర్, హింజ్‌ల మాతృసంస్థ మ్యాచ్ గ్రూప్. మ్యాచ్ గ్రూప్ తన వర్క్ ఫోర్స్‌లో 8 శాతం తగ్గించుకోనుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. అంటే.. 200 మంది ఉద్యోగులను తొలగించనుందని అర్థం అవుతున్నది. ఇందుకు కారణంగా డబ్బు ఆదా చేసుకోవడమే అని వార్తా కథనాలు తెలిపాయి.

Also Read: టిండర్ పరిచయమైన మహిళపై అత్యాచారం.. భారతీయ సంతతి వైద్యుడికి యూకేలో జైలుశిక్ష..

ఈ సంస్థ తొలి త్రైమాసిక సేల్స్‌ను ముందుగా అంచనా వేసింది. ఈ అంచనాలు కంపెనీ నిపుణులు అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. నిపుణులు తొలి త్రైమాసికంలో 816 మిలియన్ డాలర్లుగా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ, ఇది 790 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్ల వరకు పరిమితం కానుంది. దీంతో ఆ మొత్తాన్ని సేవ్ చేసుకోవడానికి ఉద్యోగులను తొలగించే నిర్ణయం తీసుకుంది. 

2021 చివరి నాటికి మ్యాచ్ గ్రూప్‌లో 2,500 మంది ఫుల్ టైమ్ వర్క్ ఫోర్స్, 40 మంది పార్ట్ టైమ్ వర్కర్లు ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. రాయిటర్స్ ప్రకారం, తాజా లే ఆఫ్ నిర్ణయంతో మ్యాచ్ గ్రూప్‌లో 200 మంది ఉద్యోగులు బయటకు వెళ్లే ముప్పు ఉన్నదని తెలిపింది. ఖర్చులు తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టిన మ్యాచ్ గ్రూప్ ఉద్యోగాల తొలగింపుతోపాటు ఆఫీసు స్పేస్, మార్కెటింగ్ వంటిలోనూ పొదుపు సూత్రం పాటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.