పెళ్లిళ్లలో చాలా రకాల సంప్రదాయాలు ఉంటాయి. చాలా రకాల పద్ధతులు ఉంటాయి.  అయితే.. ఎన్నిరకాల సంప్రదాయాలు ఉన్నా.. తాళి మాత్రం వధువు మెడలో పడాల్సిందే. కానీ.. ఇక్కడ మాత్రం భిన్నంగా జరిగింది. వధువే.. వరుడు మెడలో తాళి కట్టింది. ఈ వింత సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ తాలుకా నాలతవాడ గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నాలతవాడ  గ్రామానికి చెందిన ప్రభురాజ్ కి పెళ్లి కుదిరింది. కాగా.. సోమవారం వీరి వివాహం జరగగా.. వరుడు ప్రభురాజ్‌కు అంకిత,  మూడు ముళ్లు వేశారు.  వీరిలాగే మరో జంట  అమిత్, ప్రియలు కూడా ఇదే రకంగా వివాహం చేసుకున్నారు.

 ఇదేమి పెళ్లి అని ప్రశ్నించిన వారికి.. 12వ శతాబ్దంలో ఈ పద్ధతే అమల్లో ఉండేదని, దాన్నే మేమూ పునరుద్ధరించామని సమాధానమిచ్చారు. ఇవి అసలుసిసలైన బసవణ్ణ సిద్ధాంతాలకు లోబడి జరిగిన వివాహాలని విమర్శకుల నోళ్లుమూయిస్తున్నారట. ఈ వినూత్న వివాహ వేడుకలకు ఆధ్యాత్మికవేత్తలు ఇల్‌కల్‌ గురుమహంతేశస్వామి, చిత్రదుర్గ బసవమూర్తి, లింగస్గూరు సిద్ధలింగస్వామి తదితరులు హాజరయ్యారు.