అనుమానాస్పద స్థితిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి  మృతి చెందాడు. విద్యార్థి సజీవదహనమై కనిపించాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రణస్థలం పంచాయతీ పరిధి సీతంపేట గ్రామ సమీప తోటలో..పొలాలకు వెళ్లిన రైతులకు దుర్గారావు అనే వ్యక్తికి చెందిన పొలంలోని ధాన్యం బస్తాలు కాలిపోయి పొగలు రావడాన్ని గమనించారు.  వెంటనే ఆర్పడానికి ప్రయత్నించగా.. అందులో ఓ యువకుడి శవం గమనించారు.దీంతో.. స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

 కాలిపోయిన మృతదేహాన్ని, సమీపంలో పడిఉన్న ఏటీఎం కార్డు, పర్సులోని కళాశాల ఫీజు రశీదును గుర్తించారు. వాటి ఆధారంగా సజీవ దహనమైన యువకుడు మువ్వల నగేష్‌(18)గా తెలుసుకున్నారు. ఇతను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శివాని కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిసింది. 

 స్వగ్రామం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవుగా తేలిందని పోలీసులు తెలిపారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా మృతుడు సోదరుడు మేఘనాథ్‌  సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సజీవదహనమైన తమ్ముడు నగేష్‌ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా.. ఈమేరకు పోలీసులుకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.