జమ్మూ కశ్మీర్ లోని కుల్ గామ్ జిల్లాలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ‘హిజ్బుల్‌ ముజాహిదీన్(హెచ్‌ఎమ్‌)‌’కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బుధవారం ఉదయం హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోపాల్‌పొర ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం అందడంతో భద్రతాదళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. 

ఆ ప్రాంతంలో నిర్భంధ తనిఖీలు కొనసాగిస్తున్న సమయంలో సమీపంలోనే దాక్కొని ఉన్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో తాత్కాలికంగా మొబైల్‌,  ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.