జమ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌  జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌ లో ఒక ఉగ్రవాది హతం అయ్యాడు. ఇంకా భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. షోపియాన్ జిల్లాలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. 

జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)లోని షోపియాన్ (Shopian) జిల్లాలోని తుర్క్‌వాంగమ్ (Turkwangam) ప్రాంతంలో ఉగ్రవాదులు, భ‌ద్ర‌తా ద‌ళాల‌కు మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఓ గుర్తుతెలియ‌ని ఉగ్ర‌వాది హ‌తమ‌య్యాడు. ఈ మేర‌కు జ‌మ్మూ కాశ్మీర్ జోన్ పోలీసులు శుక్ర‌వారం వివ‌రాలు వెల్ల‌డించారు. 

“ షోపియాన్‌లోని తుర్క్‌వాంగమ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఎన్ కౌంట‌ర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆపరేషన్ పురోగతిలో ఉంది. మరిన్ని వివరాలు త్వ‌ర‌లోనే తెలియజేస్తాం ’’ అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

ఇదే షోపియాన్ (Shopian)లోని జైనాపోరా (zainapora) ప్రాంతంలోని చెర్‌మార్గ్‌లో ఫిబ్రవరి 19వ తేదీన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు కూడా వీర మ‌ర‌ణం పొందారు. షోపియాన్‌లోని చెర్‌మార్గ్ జైనపోరా గ్రామంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి అందిన స‌మాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో పోలీసులు, 1వ రాష్ట్రీయ రైఫిల్స్, 178 CRPF బెటాలియన్ సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. 

ఈ ఆపరేషన్ సమయంలో అక్క‌డి ఇళ్ల‌న‌న్నీ భ‌ద్ర‌తా ద‌ళాలు అదుపులోకి తీసుకున్నారు. అక్క‌డ ఉన్న పౌరులను ఖాళీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియలో సెర్చ్ పార్టీ గౌహర్ అహ్మద్ భట్ అనే వ్య‌క్తి ఇంటిని వెతకడం ప్రారంభించింది. ఆ ఇంట్లో ఉగ్ర‌వాది దాక్కొని ఉన్నాడు. అయితే ఆ ఇంటి యజమాని ఉద్దేశపూర్వకంగా సెర్చ్ పార్టీని తప్పుదారి ప్ర‌య‌త్నం చేశాడు. ఇంట్లో ఎవ‌రూ లేర‌ని చెప్పాడు. ఆయ‌న‌ను ప్ర‌శ్నిస్తున్న స‌మ‌యంలోనే ఇంట్లో దాక్కొని ఉన్న ఒక ఉగ్ర‌వాది సెర్చ్ పార్టీపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్ద‌రు ఆర్మీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే వారికి తీవ్ర గాయాలు కావ‌డంతో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి వారు మృతి చెందారు. 

జ‌వాన్ల‌పై ఉగ్ర‌వాది కాల్పులు జ‌రిపిన వెంట‌నే దానిని ఎదుర్కొనేందుకు జ‌వాన్లు ఫైరింగ్ స్టార్ చేశారు. ఇది ఎన్ కౌంట‌ర్ కు దారి తీసింది. ఈ ఎన్ కౌంట‌ర్ లో ఆ ఉగ్రవాది హతమయ్యాడు. ఆ ప్రాంతం నుంచి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో మృతి చెందిన ఉగ్ర‌వాది పుల్వామా కు చెందిన గులాం మొహి-ఉద్-దిన్ దార్ కుమారుడు అబ్దుల్ ఖయూమ్ దార్‌గా గుర్తించారు. అత‌డికి నిషేధిత ఉగ్రవాద సంస్థ ల‌ష్క‌రే తోయిబా (LeT) తో సంబంధాలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి ఒక AK-సిరీస్ రైఫిల్, ఒక పిస్టల్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.