జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లాలోని సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
జమ్మూకాశ్మీర్ ఎన్‌కౌంటర్: జమ్మూకాశ్మీర్ లో బుధవారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారముల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ కొనసాగుతున్నదని వెల్లడించాయి. ఈ కాల్పులు ఒక సాధారణ పౌరునికి కూడా గాయాలయ్యాయి. అతన్ని శ్రీనగర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. హతమైన ఉగ్రవాదులకు జైషే మహ్మద్ (జేఎం) తో సంబంధాలున్నాయని సమాచారం. కాల్పుల్లో హతమైన ఉగ్రవాదులను సోపోర్‌కు చెందిన మహ్మద్ రఫీ, పుల్వామాకు చెందిన కైజర్ అష్రఫ్‌గా గుర్తించారు.
ఇద్దరూ అనేక ఉగ్రవాద నేరాల్లో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. వారు సోపోర్ ప్రాంతంలో పౌరులపై దాడి చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారని తమకు సమాచారం ఉందనీ, ఈ క్రమంలోనే ఆపరేషన్ కొనసాగించామని తెలిపారు. "హతమైన జైషే మహ్మద్ (జేఎం) ఉగ్రవాదులను సోపోర్‌కు చెందిన మొహద్‌రఫీ, పుల్వామాకు చెందిన కైసర్ అష్రాఫ్‌గా గుర్తించారు. ఉగ్రవాది రఫీపై గతంలో రెండుసార్లు పీఎస్‌ఏ కింద కేసు నమోదైంది. వీరిద్దరూ అనేక ఉగ్రవాద నేరాలకు పాల్పడ్డారు. మాకు అందిన సమాచారం ప్రకారం వారు సోపోర్ ప్రాంతంలో పౌరులపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు" అని కాశ్మీర్ ఏడీజీపీ తెలిపారు.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాల సంయుక్త బృందానికి సమాచారం అందడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా చుట్టుముట్టింది. ఈ క్రమంలోనే అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది కూడా సమర్థవంతంగా ఎదురుకాల్పులు జరిపారు. కాగా, మంగళవారం షోపియాన్ జిల్లాలోని నాగ్‌బాల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు.
