రోజురోజుకూ చిన్నారుల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అభం, శుభం తెలియని ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కిరాతకుడు. తన వాంఛ తీర్చుకున్న తరువాత ఆ చిన్నారి చేతిలో ఐదు రూపాయలు పెట్టి, ఎవ్వరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. 

ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్ అయోధ్య నగర్ కు చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలిక శనివారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. 

ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బాలికకు రూ. 100 ఇచ్చి పొగాకు పొట్లాలు కొనుక్కురమ్మని చెప్పాడు. సరే అన్న ఆ చిన్నారి పొగాకు పొట్లాలు తెచ్చి అతడికి ఇచ్చింది. అయితే, ఆ వ్యక్తి వాటిని తీసుకోకుండా కాస్త దూరంలో మరో వ్యక్తి ఉన్నాడని అతనికి ఇవ్వాలని చెప్పాడు. 

దీంతో సరేనన్న చిన్నారి నడుచుకుంటూ అతను చెప్పిన వైపుకు బయలుదేరింది. ఆ వ్యక్తి ఆ చిన్నారి వెనకే అనుసరించి, మధ్యలో చెత్త కుప్పల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఐదు రూపాయలు పాప చేతిలో పెట్టి, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించాడు.

ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయం తన అమ్మమ్మకు చెప్పింది. దీంతో ఆమె పాపను అయోధ్య నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను తీసుకెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. పాప ఆ వ్యక్తిని రెండు సార్లు మాత్రమే చూసినట్లు పోలీసులకు చెప్పింది. 

ఆ రోజు ఆ ఏరియాలో తిరిగిన 40 మంది ఫొటోలను చిన్నారికి చూపించగా, అందులో రవి అనే 30యేళ్ల వ్యక్తిని గుర్తించింది. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితుడి భార్య అతడితో విడిపోయి వేరుగా ఉంటుందని విచారణలో తేలింది. అత్యాచారం కారణంగా పాప తీవ్రంగా షాక్ కు గురైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం పాప శారీరక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు.