Asianet News TeluguAsianet News Telugu

న్యూస్ క్లిక్‌‌‌పై ఈడీ దాడులు: కేంద్రం కక్షసాధింపే.. భగ్గుమన్న జర్నలిస్ట్ సంఘాలు

న్యూస్‌క్లిక్‌ అనే న్యూస్‌ పోర్టల్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మంగళవారం ఏకకాలంలో దాడులు చేపట్టింది. దేశంలోని మొత్తం ఎనిమిది చోట్ల దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు చెప్పారు

ED Raids on premises of NewsClick news portal office ksp
Author
New Delhi, First Published Feb 10, 2021, 7:52 PM IST

న్యూస్‌క్లిక్‌ అనే న్యూస్‌ పోర్టల్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మంగళవారం ఏకకాలంలో దాడులు చేపట్టింది. దేశంలోని మొత్తం ఎనిమిది చోట్ల దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు చెప్పారు.

మనీ లాండరింగ్‌ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం కోసం ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. వీరు నడుపుతున్న వెబ్‌సైట్‌ పేరు న్యూస్‌క్లిక్‌.ఇన్‌ అని తెలిపారు.

మంగళవారం ఉదయం ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, ఖాతాలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పలువురిని ప్రశ్నించినట్టు సమాచారం. 

ఈడీ దాడులపై న్యూస్‌క్లిక్.ఇన్‌ వెబ్‌సైట్‌ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్‌ పుర్కాయస్త స్పందించారు. తమపై దాడి జరగడంపై ఆయన స్పందిస్తూ.. జర్నలిజాన్ని తొక్కేసేందుకు, నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు కేంద్రం ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

అసలు వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ప్రదీప్ చెప్పారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

అయితే ఈడీ అధికారులు మాత్రం.. ఆ న్యూస్‌ పోర్టల్‌కు విదేశాల నుంచి వస్తున్న నిధుల్లో అవకతవకలు ఉన్న కారణంగా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్న విషయాన్ని న్యూస్‌క్లిక్‌లో యూట్యూబ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్న అభిసర్‌ శర్మ ధ్రువీకరించారు.

కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ... వార్తలు, వీడియోలను అందిస్తున్నందుకే వేధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులని ప్రజా సంఘాలు, జర్నలిస్టులు విమర్శిస్తున్నారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలను మోడీ సర్కార్‌ వెంటనే మానుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ దాడులను ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్సు(డీయూజే), డిజిపబ్‌ న్యూన్‌ ఇండియా ఫౌండేషన్‌లు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్న జర్నలిజం, మీడియా స్వేచ్ఛపై చేస్తున్న దాడి అని పేర్కొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios