Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ గేమ్స్ యాప్‌లపై ఈడీ కొరడా.. రూ. 68 కోట్లు ఫ్రీజ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఆన్‌లైన్ గేమ్స్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝుళిపించింది. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా కోడా పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మూడు ప్రాంగణాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

ED conducts raids at Coda Payments in money laundering case
Author
First Published Sep 27, 2022, 4:06 PM IST

ఆన్‌లైన్ గేమ్స్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝుళిపించింది. కోడా పేమెంట్స్ ఇండియా కంపెనీ, గరేనా ఫ్రీ ఫైర్‌లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా మంగళవారం ఈడీ అధికారులు కోడా పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మూడు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. కోడా పేమెంట్స్ ఇండియా కంపెనీ, గరేనా ఫ్రీ ఫైర్‌‌లపై ఇప్పటికే పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కోడా పేమెంట్స్ ఇండియా.. గేమ్ పబ్లిషర్‌లకు ఆదాయాన్ని ఆర్జించే పేరుతో తీన్ పట్టి గోల్డ్, గరేనా ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ మొదలైన గేమ్‌ల కోసం తుది వినియోగదారుల నుంచి చెల్లింపును సులభతరం చేయడం, సేకరించడం చేస్తుంది. 

అయితే ఫ్రీ ఫైర్ ని పబ్లిష్ చేసే గరేనా సింగపూర్ నుంచి నిర్వహించబడుతోంది. భారతదేశంలో అది కంపెనీని  గానీ, ఉనికిని గానీ కలిగి లేదు. కోడా పేమెంట్స్ సింగపూర్ ఏజెంట్‌గా వ్యవహరించడానికి కోడా పేమెంట్స్ ఇండియాను ఏర్పాటు చేసినట్టుగా ఈడీ గుర్తించింది. కోడా పేమెంట్స్ కంపెనీ వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేసి మాతృసంస్థకు పంపిస్తోందని ఈడీ ఆరోపించింది. బ్యాంకు ఖాతాలు, పేమెంట్ గేట్‌వేలు, ఎఫ్‌డిలలో ఉన్న రూ.68.53 కోట్లను ఈడీ స్తంభింపజేసింది. కోడా పేమెంట్స్ ఇప్పటివరకు రూ.2,850 కోట్లు వసూలు చేసిందని.. అందులో రూ.2,265 కోట్లు విదేశాలకు తరలించిందని ఈడీ గుర్తించింది. 

‘‘గేమ్‌ల తుది వినియోగదారులకు(ఎక్కువగా సందేహించని పిల్లలు).. గేమ్‌లో వారి ఆట అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే డిజిటల్ టోకెన్‌లను విక్రయించే పేరుతో కోడా పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ అనధికారిక చెల్లింపులను సేకరిస్తుందనేది ఆరోపణ’’ అని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. కోడా, గరేనా వంటి గేమ్ డెవలపర్స్.. లావాదేవీని అనుసరించి, ఎటువంటి ప్రమాణీకరణ లేకుండా తదుపరి చెల్లింపులు చేయడానికి అనుమతి కోరుతూ నోటిఫికేషన్ పాప్ అప్ అయ్యే  విధంగా ఉద్దేశపూర్వకంగానే చెల్లింపు విధానాన్ని రూపొందించారని కూడా ఈడీ ఆరోపించింది.

‘‘ఈ సాంకేతిక నిబంధనల గురించి పిల్లలకు తెలియకపోవడంతో.. వారు సాధారణ పద్ధతిలో నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి, తదుపరి ధృవీకరణ లేకుండా అన్ని భవిష్యత్ చెల్లింపులను చేయడానికి అధికారాన్ని ఇస్తారు’’ ఈడీ ప్రకటనలో పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios