అల్లరిమూక ఆగడాలకు విద్యార్థిని బలి.. వేధిస్తూ, బలవంతంగా శానిటైజర్ తాగించి, అడ్డొచ్చిన సోదరుడిపై కూడా..
స్కూల్ కు వెళ్లి వస్తున్న బాలికపై నలుగురు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆమెను వేధింపులకు గురి చేశారు. అడ్డొచ్చిన సోదరుడిని చితకబాదారు. అనంతరం బాలికతో బలవంతంగా శానిటైజర్ తాగించారు. దీంతో బాలిక చనిపోయింది.
అల్లరి మూకల ఆగడాలకు ఓ విద్యార్థిని ప్రాణం కోల్పోయింది. ఆ అల్లరిమూక చేసిన చిల్లర చేష్టలకు ఆమె తీవ్రంగా అస్వస్థతకు గురై మరణించింది. ఆ బాలికను పలువురు దుండుగులు వేధిస్తూ, వెంట పడ్డారు. అనంతరం శానిటైజర్ తాగించారు. దీంతో ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీ పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఓ స్కూల్ లో 11వ తరగతి చదువుతోంది. ఆ బాలిక ఎప్పటిలాగే జూలై 27వ తేదీన స్కూల్ కు వెళ్లి సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్తోంది. అయితే మధ్యలో మఠ్ లక్ష్మీపుర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఉదేశ్ రాథోడ్ ఆమెను అడ్డుకున్నాడు. ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు.
కొంత సమయం తరువాత ఆ యువకుడికి మరో ముగ్గురు తోడు వచ్చారు. వారు కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అయితే అదే తోవలో బాలిక సోదరుడు వచ్చాడు. ఆ యువకుల దుశ్చర్యను గమనించి, వెంటనే వారి వద్దకు వెళ్లాడు. అల్లరి మూక ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బాలుడు ఒక్కడే ఉండటం, నిందితులు నలుగురు ఉండటంతో ఏమీ చేయలేకపోయాడు. ఆ దుండగులు బాలుడిపై కూడా దాడి చేశారు.
అనంతరం బాలిక సోదరుడిని పక్కకు పడేశారు. ఆ బాలిక కూడా దుండగుల దుశ్చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కోపోద్రిక్తులు అయిన దుండుగులు ఆమెతో బలవంతంగా శానిటైజర్ తాగించారు. పైగా దీనిని ఆ యువుకులు వీడియో కూడా తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా.. బాధితురాలిని కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ బాలిక చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి మంగళవారం చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.