ఒక స్నేహితుడిలా భోదనలు చేస్తూ.. వారి మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఓ ఉపాధ్యాయుడికి బదిలీ వేటు వేయడంతో పసిమనసులు గాయపడ్డాయి.. మాష్టారు మీరు వెళ్లొద్దు అంటూ గుక్కిపట్టి ఏడ్చాయి.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం చిక్కమగుళూరు కైమార ప్రభుత్వ పాఠశాలలో దుర్గేశ్ అనే ఉపాధ్యాయుడు గత 12 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అందరిలా కాకుండా విభిన్నంగా పాఠాలు చెప్పే అతనంటే ప్రతి ఒక్క విద్యార్ధికి ఎంతో అభిమానం.

ఈ క్రమంలో శనివారం దుర్గేశ్‌ను మరో చోటికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్ధులు బోరుమంటూ రోదించారు.. మీరు వెళ్లొద్దు...మిమ్మల్ని వెళ్లనీయమని ఆయనను అడ్డుకున్నారు.

బదిలీ గురించి ఉన్నతాధికారుల వద్ద పోరాటం చేస్తామని కన్నీటి పర్యంతమయ్యారు. తనపై విద్యార్ధులు చూపుతున్న అభిమానం చూసి దుర్గేశ్ సైతం కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. తన బదిలీ విషయం దుర్గేశ్‌కు ఎప్పుడో తెలుసు..

బయటకు తెలిస్తే తనను వెళ్లనీవ్వరని ముందే పసిగట్టిన ఆయన ట్రాన్స్‌ఫర్ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ విద్యార్ధులకు విషయం తెలియడంతో వారిని దుర్గేశ్ అడ్డుకోలేకపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యం చక్కర్లు కొడుతోంది.