న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఆందోళనకు గురవుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు అభ్యర్థులకు రాహుల్ గాంధీ మనోధైర్యం నింపే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు సరిగ్గాలేవని పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ట్వీట్‌ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి భయపడొద్దంటూ హితవు పలికారు. ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలకు.. రాబోయే 24 గంటలు మనకెంతో విలువైన సమయం. 

ఎంత వీలైతే అంత అప్రమత్తంగా ఉండండి. భయపడకండి. మనం వాస్తవాల కోసం పోరాడుతున్నాం. ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి భయపడకండి. వాటి వల్ల వస్తున్న పరిణమాల పట్ల చలించకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. పార్టీ మీద విశ్వాసం ఉంచండి. 

మీ శ్రమ వృథాగా పోదు..జై హింద్‌ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్‌ చేశారు. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఆదివారం జరిగిన చివరి దశ ఎన్నికల అనంతరం ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. 

ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇకపై కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా వారిలో జోష్ నింపేందుకు రాహుల్ గాంధీ ఇలా ట్వీట్ చేశారు.