కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి పార్కింగ్‌ స్థలంలో కనిపించిన మూడు డిస్పోజబుల్ బ్యాగులు షాక్ ఇచ్చాయి. 

ఆ బ్యాగుల్లో 17 కుక్కపిల్లలు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన వెలుగు చూసింది. పిల్లలతో పాటు కుక్క కూడా ఓ సంచిలో ఉంది. బతికే ఉన్న ఆ కుక్క నుంచి రక్తం ధారాళంగా కారుతోంది. 

స్థానికులు సంచిని చింపిన వెంటనే నొప్పికి తాళలేని కుక్క ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. మిగతా రెండు సంచులను చింపిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న కుక్క పిల్లలను బయటకు తీశారు. అయితే, చికిత్స కోసం వాటిని తరలిస్తుండగా మరణించాయి.
 
స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ఆ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కుక్కపిల్లలకు పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.