Asianet News TeluguAsianet News Telugu

సూర్య నమస్కారాలు చేయండి.. జమ్ము కశ్మీర్ కాలేజీలకు ఆదేశాలు.. భగ్గుమన్న కశ్మీరీ లీడర్లు

జమ్ము కశ్మీర్ కాలేజీ విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ముస్లిం మెజారిటీ రీజియన్‌లో ఇలాంటి ఆదేశాలు జారీ కావడం సరికాదని మండిపడుతున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా కాలేజీ విద్యార్థులు, సిబ్బంది వర్చువల్‌గా సూర్య నమస్కారాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవి తమ మతపరమైన హక్కులను కాలరాసేలా ఉన్నాయని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు.
 

do surya namaskara.. orders passed to jammu kashmir colleges
Author
New Delhi, First Published Jan 14, 2022, 1:35 AM IST

శ్రీనగర్: మకర సంక్రాంతి(Makara Sankranti) సందర్భంగా ఆ రోజు జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir)లోని కాలేజీల్లో సూర్య నమస్కారాలు(Surya Namaskara) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. స్థానిక నేతలు ఈ ఆదేశాలపై మండిపడుతున్నారు. జమ్ము కశ్మీర్‌లోని కాలేజీ విద్యార్థులను సూర్య నమస్కారాలు చేయాల్సిందిగా ఆదేశించడం ఇదే తొలిసారి. ముస్లిం(Muslim) మెజార్టీగా ఉన్న రీజియన్‌లో ఇలాంటి ఆదేశాలు రావడంపై అక్కడి స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవి తమ విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ నెల 14వ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జమ్ము కశ్మీర్‌లోని విద్యార్థులతో వర్చువల్‌గా సూర్య నమస్కారాలు చేయించాల్సిందిగా ఆ ఆదేశాలు తెలిపాయి.

జమ్ము కశ్మీర్ ఉన్నత విద్యా శాఖ ఈ ఆదేశాలను కాలేజీలకు జారీ చేసింది. సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ప్రజా కేంద్రంగా నిర్వహించాలని పేర్కొంది. కళాశాల సిబ్బంది, విద్యార్థులు క్రియాశీలకంగా ఇందులో పాల్గొనడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కశ్మీరీలందరినీ సామూహికంగా అగౌరవ పరిచే, మరింత దెబ్బ తీసే చర్య అని విమర్శించారు. అంతర్లీనంగా మతపరమైన ఉద్దేశాలు ఉండే ఇలాంటి చర్యలను చేపట్టాలని విద్యార్థులు, స్టాఫ్‌ను ఆదేశాల ద్వారా బలవంతపెట్టడం వారి..  మతోన్మాద బుద్ధిని బహిర్గతం చేస్తున్నదని ఆరోపించారు.

యోగా సహా ఇతర కార్యక్రమాలు చేపట్టి మకర సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలని ముస్లిం విద్యార్థులను ఎందుకు బలవంతపెట్టాలి? అని జమ్ము కశ్మీర మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. మకర సంక్రాంతి ఒక పండుగ అని, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది ఎవరికి వారి వ్యక్తిగత నిర్ణయం అని వివరించారు. ఒక వేళ ఈద్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ముస్లిం సీఎం.. ముస్లీమేతర విద్యార్థులను ఆదేశిస్తే.. బీజేపీ సంతోషిస్తుందా? అని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి ఉమేష్ తలాషి కూడా ఇదే తరహా స్పందించారు. ఒక వేళ రేపు రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరు ఉపవాసాలు ఆచరించాలని ఒక ముస్లిం సీఎం ఆదేశాలు జారీ చేస్తే.. ముస్లిమేతర ప్రజలు ఆ ఆదేశాలపై ఎలా ఉంటారు? అని ప్రశ్నించారు. కాబట్టి, మతపరమైన కార్యక్రమాలను బలవంతంగా తలపై మోపడాన్ని నిలిపేయాలని పేర్కొన్నారు. అలాంటి విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. మరో లీడర్ రుహుల్లా మెహదీ కూడా ఈ ఆదేశాలపై స్పందిస్తూ.. కశ్మీరీ అధికారులనే టార్గెట్ చేసుకున్నారు. ఈ ఆదేశాలపైనా ఇక్కడి అధికారులు సంతకాలు పెట్టడం అధికారుల బానిసత్వాన్ని వెల్లడిస్తున్నదని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios