తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వాస్తు, జ్యోతిష్యం, ముహూర్తాలు వంటి వాటిపై నమ్మకం బాగా ఎక్కువని అందరికీ తెలిసిందే. ముహూర్తం చూడనిదే ఆయన అడుగు తీసి అడుగు కూడా పెట్టరు. అలాగే తాను చేయబోయే పనుల్లో విజయం వరించాలనే ఉద్దేశ్యంతో ఆయన హోమాలు, యజ్ఞాలు కూడా చేశారు.

ఇవాళ్టీ నుంచి మరో హోమం ప్రారంభించేశారు కూడా. తాజాగా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారట తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.  సీఎం పదవి కోసం ఓపీస్ సచివాలయంలో ఓ యాగం చేయించినట్లు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించడం తమిళనాట కలకలం రేపింది.

ఆదివారం పుదుకోట్టై జిల్లా విరాలిమలైలో గిన్నిస్ రికార్డు ప్రదర్శన కోసం జల్లికట్లు పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం ఖాళీగా ఉండటంతో ఆదివారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం యాగం చేయించినట్లు, ఉదయం 5.30 గంటలకు ఓపీఎస్ యాగంలో పాల్గొన్నట్లు ప్రచారం జరిగింది.

డీఎంకే ఎమ్మెలయే అరవింద్ రమేశ్ ఇంట్లో వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత స్టాలిన్ ‘‘యాగం’’ విషయంపై ఆరోపణలు చేశారు. కొడనాడు కేసులో సీఎం పళనిస్వామి జైలుకి వెళతారని అప్పుడు ఖాళీ అయ్యే ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికే ఈ యాగం చేశారా..? లేక అక్కడ ఉన్న పత్రాలను మాయం చేసేందుకా అని స్టాలిన్ ప్రశ్నించారు.

సచివాలయం ఉన్న సెయింట్ జార్జ్ కోట సర్వమతాలకు నిలయమని... అక్కడ యాగం నిర్వహించే అధికారం పన్నీర్ సెల్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవుతుందని చెబుతున్నందుకు పళనిస్వామి తనపై కేసు పెట్టే అవకాశముందని ధైర్యముంటే ఆ పనిచేయాలంటూ సవాల్ విసిరారు.

స్టాలిన్ ఆరోపణలను మంత్రి జయకుమార్ సహా అన్నాడీఎంకే శ్రేణులు ఖండించాయి. సచివాలయంలో పన్నీర్ సెల్వం యాగం నిర్వహంచారు అనడానికి ఆధారాలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. ఇది పుకారు మాత్రమేనని, ఆయన యాగం నిర్వహించడాన్ని ఎవరు చూశారని ప్రశ్నించారు. అన్నాడీఎంకేలో చీలికలు తెచ్చేందుకే స్టాలిన్, దినకరన్ చేసిన కుట్రగా మంత్రి జయకుమార్ అభివర్ణించారు.