ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని ఇది దేశానికి మంచిది కాదన్నారు.
ఢిల్లీ: ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని ఇది దేశానికి మంచిది కాదన్నారు. ప్రస్తుతం ఉన్న నాయకులలో ప్రధాని నరేంద్రమోదీ ఆదర్శనాయకుడని అతనికి మరెవ్వరూ పోటీరారని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమ నాయకుడు. ప్రతిపక్షాల్లో కానీ మరే ఇతర రాజకీయ పార్టీల్లోనూ మోదీకి పోటీ వచ్చే వాళ్లే లేరన్నారు. మోదీ డైనమిక్ లీడర్. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
2019 ఎన్నికల్లో తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వడం లేదని నాకు రాజకీయ హద్దులు ఉన్నాయని తెలిపారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశానని ఈసారి ఉత్తమమైన భారత్‌ని తయారు చేసేవాళ్లకే నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ వ్యవస్థ సక్రమంగా లేదన్నారు.
రాజకీయ నాయకులకు అభివృద్ధి, విద్య, మౌలికసదుపాయాలు, విధి విధానాలు వంటి అంశాలపై మంచి పట్టు ఉండాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ మండిపడ్డారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ సరైన బాటలో నడవడంలేదని ఇది దేశ ఉనికికే ప్రమాదకరం అన్నారు.
రాందేవ్ బాబా ఇటీవలే కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనం, పెట్రో ధరలు పెరగడం వంటి అంశాలకు కేంద్రప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికల్లో భాజపా గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.
