Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్ సింగ్.. సోనియాతో భేటీ అనంతరం అశోక్ గెహ్లాట్ నామినేషన్ పై స్పష్టత

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్ సింగ్ దిగనున్నట్టు తెలిసింది. ఆయన ఈ రోజు అధ్యక్ష రేసులో పోటీ చేయడానికి నామినేషన్ పేపర్లు కలెక్ట్ చేసుకున్నారు. రేపు నామినేషన్ వేయనున్నట్టు ఆయన తెలిపారు.

digvijaya singh to file nomination papers tomorrow for congress president election
Author
First Published Sep 29, 2022, 2:13 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో సీనియర్ లీడర్, గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడైన దిగ్విజయ్ సింగ్ కూడా నామినేషన్ వేయనున్నారు. ఆయన ఈ రోజు నామినేషన్ పేపర్లు కలెక్ట్ చేసుకున్నారు. ఈ మేరకు ఆయన విలేకరులకు వెల్లడించారు. ‘నేను నామినేషన్ పేపర్లు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. రేపు నా నామినేషన్ పత్రాలు సమర్పిస్తాను’ అని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్లు సమర్పించడానికి గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదని తెలుస్తున్నది. ఇప్పటి వరకు అధ్యక్ష అభ్యర్థిగా శశిథరూర్ ఉన్నారు. ఆయన కూడా రేపే నామినేషన్లు వేయనున్నారు. 

దిగ్విజయ్ సింగ్ అభ్యర్థిత్వంపై ఊహాగానాలు ఉన్నప్పటికీ ఆయన మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ అధ్యక్ష అభ్యర్థిత్వంపై తనకు ఆసక్తి లేదన్నట్టుగానే వ్యవహరించారు. కానీ, నిన్న ఈ అంశంపై మాట్లాడుతూ.. తాను ఎవరితోనూ ఈ విషయం గురించి మాట్లాడలేదని అన్నారు. హై కమాండ్ నుంచి కూడా ఎలాంటి అనుమతి తీసుకోలేదని వివరించారు.

75 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ మాజీ సీఎం.. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ లాగే.. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు.

మొన్నటి వరకు అధ్యక్ష రేసులో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫేవరేట్ అభ్యర్థిగా ఉన్నారు. కానీ, సీఎం పోస్టుపై ఆయన వర్గం తిరుగుబాటు చేయడం గాంధీలు సహా ఢిల్లీలోని ఇతర సీనియర్ నేతలను అసంతృప్తి పరిచింది. 

అయితే, కాంగ్రెస్‌లోనూ పలువురు నేతలు ఇప్పటికీ అశోక్ గెహ్లాట్ నామినేషన్ వేస్తారని అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు ఆయన సోనియా గాంధీతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశం తర్వాత అశోక్ గెహ్లాట్ నామినేషన్ పై స్పష్టత వస్తుందని తెలుస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios