దేశంలో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోంది.. : మోడీ టార్గెట్ గా రాహుల్ గాంధీ విమర్శలు
New Delhi: ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా భారత్ లో చాలా మంది పోరాడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ ప్రసంగించిన వీడియోలో.. భారతదేశంలో ప్రజాస్వామ్యం తీవ్రమైన దాడిలో ఉందని పేర్కొంటూ.. చాలా మంది దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పారు.

Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కారు, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ లో ప్రజాస్వామ్యానికి సంబంధించి అంతా మారిపోయిందనీ, ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలను మాట్లాడనివ్వకపోవడంతో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యం తీవ్రమైన దాడిని ఎదుర్కొంటున్నప్పటికీ, దేశంలోని ప్రజలు దానిని కాపాడటానికి పోరాటం చేస్తున్నారని చెప్పారు.
"ఆ డిఫెన్స్ ఆగిపోయినప్పుడు, ఎప్పుడైనా, భారతదేశం ఇకపై ప్రజాస్వామ్యం కాదని నేను చెబుతాను. అయితే, మన ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారు ఇంకా చాలా మందే ఉన్నారు. పోరాటం ముగిసిపోలేదని, ఈ పోరాటంలో మనం గెలుస్తామని నేను అనుకుంటున్నాను" అని నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ గురువారం విడుదల చేసింది.యూనివర్శిటీలో జరిగిన ఫ్రీ వీలింగ్ సంభాషణలో రాహుల్ గాంధీ భారత్-ఇండియా పేరు వివాదం గురించి మాట్లాడుతూ, ప్రధాని భారతదేశం (ఇండియా) పేరును భారత్ గా మార్చితే, ప్రతిపక్ష కూటమి ఇండియా కూడా దాని పేరును మారుస్తుందనీ, అప్పుడు ప్రధాని మళ్లీ దేశం పేరును మార్చాల్సి ఉంటుందని ఎత్తిచూపారు.
ప్రభుత్వం భారత్ ను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఆ దేశం పేరును మార్చవచ్చని, ఇండియా పేరును తొలగించవచ్చని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. ప్రతిపక్ష కూటమి తనను తాను ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్) అని పిలుచుకోవడం వల్లనే భారత్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. భారత ప్రజాస్వామ్య హత్యను సహించబోమని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ఆర్ఎస్ఎస్ ఆక్రమించుకోనివ్వమనీ, భారతదేశంలో సృష్టించబడిన అసమానత స్థాయి ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ, విద్యపై ఎక్కువ ఖర్చు చేయాలనీ, దీనికి కోసం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
దేశంలో ఒక నిర్దిష్ట భావజాలాన్ని తాను సమర్థిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. "ఇది మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధుడు, గురునానక్ ల భావజాలం. దాని కోసం పోరాడతాను. నేను లీడర్ అవుతానా లేదా అనేది సెకండరీ... దేశ భవిష్యత్తు కోసం సైద్ధాంతిక పోరాటంలో నిమగ్నమయ్యాం.. మన స్థానాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.. అదే నేను చేస్తున్నానని" ఆయన అన్నారు. 2014 వరకు భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే తటస్థ సంస్థలు, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు, అందరికీ మీడియా అందుబాటు, అందరికీ ఆర్థిక సదుపాయం వంటి వాటితో రాజకీయ పార్టీలు పరస్పరం పోరాడేవని, కానీ 2014 తర్వాత ఇవన్నీ మారిపోయాయని అన్నారు.