న్యూఢిల్లీ: దీపావళిని పురస్కరించుకొని బాణసంచా కాల్చవద్దని ఢిల్లీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిందని అధికారులు ప్రకటించారు.

గాలి నాణ్యత 414గా నమోదైంది. 2016 దీపావళి నుండి ఇప్పటివరకు ఈ స్థాయిలో గాలి నాణ్యత నమోదు కాలేదని అధికారులు తెలిపారు. నాలుగేళ్ల తర్వాత గాలి నాణ్యత భారీగా పడిపోయిందని అధికారులు ఆదివారం నాడు ప్రకటించారు.

గత ఏడాది దీపావళికి నగరంలో 24 గంటల పాటు గాలి నాణ్యత 337గా నమోదైంది. ఆ తర్వాత రెండు రోజుల పాటు 368 నుండి 400కి చేరుకొంది. గత ఏడాది అక్టోబర్ 27వ తేదీన దీపావళి పర్వదినం జరుపుకొన్న విషయం తెలిసిందే.


2018లో దీపావళి రోజున గాలి నాణ్యత 281గా నమోదైంది. ఆ తర్వాత రోజు 390కి చేరింది. 2017లో  అక్టోబర్ 19న దీపావళి రోజున గాలి నాణ్యత 319కి చేరుకొంది. ఆ తర్వాత రోజున గాలి నాణ్యత మరింతగా పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.

గాలి నాణ్యత క్షీణించడంతో కరోనా వైరస్ సహా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఢిల్లీ నగరంలోని చాలా ప్రాంతాల్లో 400 కంటే ఎక్కువగా గాలి నాణ్యత రికార్డైంది. మరికొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత 500 మార్కుకు చేరుకొంది. దీపావళి రోజున రాత్రి కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత 800 దాటింది.

నగరంలో కాలుష్యం ఇప్పటికే పెరిగిపోవడంతో నవంబర్ 9 అర్ధరాత్రి నుండి నవంబర్ 30వ తేదీ వరకు బాణసంచా విక్రయాలను నేషనల్ కేపిటల్ రీజియన్ లో  నిషేధించారు.

ఇవాళ ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖాధికారులు తెలిపారు. కాలుష్య కారకాలను కడిగేందుకు ఈ వర్షం సరిపోతుందా లేదా అనేది ఇంకా తెలియదని ప్రాంతీయ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ చెప్పారు.

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోవడం ఆందోళన కల్గిస్తోందని అధికారులు తెలిపారు. ఈ విషయమై చర్చించేందుకు  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసే అవకాశం ఉందని సమాచారం.